దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
- జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించిన భారతీయ అంబేడ్కర్ సేన
1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులోని మతపరమైన పరిమితులను తొలగించి, దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదా తోపాటు రక్షణలు కల్పించాలని కోరుతూ, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) తరపున జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ కు, 75 పేజీల వివరణాత్మక వినతిపత్రం మెయిల్ ద్వారా పంపించడం జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీయం శివప్రసాద్, జాతీయ సమన్వయ కర్త దుర్గం సుబ్బారావులు నేడొక ప్రకటనలో తెలియజేశారు. షెడ్యూల్డ్ కులాల గుర్తింపు కలిగి, క్రైస్తవ – ఇస్లాం మతాలకు విశ్వాసులుగా ఉన్న వారికి ఎస్సీ హోదా కొనసాగించడంపై అధ్యయనం చేసేందుకు, సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన నాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ చైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భారతీయ అంబేడ్కర్ సేన, జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కు వినతిపత్రం సమర్పించింది.
భారతీయ అంబేడ్కర్ సేన, జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కు సమర్పించిన వినతి పత్రంలోని ప్రధానమైన అంశాలను తెలియజేస్తూ గురువారం శివప్రసాద్, సుబ్బారావులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కులం అనేది కేవలం మతపరమైన గుర్తింపు కాదని, అది పుట్టుకతో వచ్చే సామాజిక వాస్తవమని, మతం మారినంత మాత్రాన కుల గుర్తింపు మరియు కుల వివక్ష అదృశ్యం కావని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులు ఇప్పటికీ అంటరానితనం, సామాజిక బహిష్కరణ, వివక్ష మరియు ఆర్థిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారని, చర్చిలలో కూడా కుల వివక్ష, ప్రత్యేక ప్రార్థనా స్థలాలు, ప్రత్యేక శ్మశానవాటికలు మరియు కుల ప్రాతిపదికన వివాహ సంబంధాలు వంటి ఆచారాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
రాజ్యాంగం పౌరులకు సమానత్వం, గౌరవం మరియు సామాజిక న్యాయాన్ని ప్రసాదించిందని, కేవలం మత ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాల హోదాను నిరాకరించడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. 1956లో సిక్కు మతంలోకి మారిన దళితులకు, 1990లో బౌద్ధంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించినట్లే, దళిత క్రైస్తవులకు కూడా కల్పించాలని తాము కమిషన్ ను కోరినట్లు తెలిపారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, షెడ్యూల్డ్ కులాల హోదాను మతంతో ముడిపెట్టకుండా పూర్తిగా వేరు చేయాలని సిఫార్సు చేసిందని, సచార్ కమిటీ నివేదిక కూడా మత మార్పిడి జరిగినప్పటికీ సామాజిక మరియు ఆర్థిక వెనుకుబాటుతనం కొనసాగుతుందని ధృవీకరించిందని పేర్కొన్నారు.
దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2009, 2019 మరియు 2023 సంవత్సరాలలో తీర్మానాలను ఆమోదించింది. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న సామాజిక న్యాయ డిమాండ్‌గా పరిగణించబడుతోందని తెలిపారు. దళిత క్రైస్తవులు అనుభవిస్తున్న సామాజిక మరియు ఆర్థిక వివక్షలు షెడ్యూల్డ్ కులాల హోదా ఉన్న ఇతర వర్గాల వారికి సమానంగా ఉన్నాయని, అందువల్ల 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులోని మతపరమైన పరిమితిని తొలగించి, దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదాను మరియు సంబంధిత రాజ్యాంగ రక్షణలను, రిజర్వేషన్లను కల్పించాలని జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్‌ను కోరినట్లు శివప్రసాద్, సుబ్బారావులు తెలియజేశారు.



